

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లలో భారత కరెన్సీ రూపాయి మరింత బలహీనపడింది. బుధవారం జరిగిన ట్రేడింగ్ సెషన్లో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 90 రూపాయల మార్క్‌ను దాటి, ఇప్పటివరకు ఎప్పుడు కనిపించని కనిష్ఠ స్థాయికి చేరింది. గత సెషన్ లో 89.96 వద్ద ముగిసిన రూపాయి, నేటి ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒత్తిడికి లోనైంది. కొంతసేపు 90.14 వరకు క్షీణించి ఆల్‌టైమ్ లోయెస్ట్ను స్పృశించింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో రూపాయి 90.12 వద్ద ట్రేడవుతోంది.
దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ పెరగడం, మార్కెట్లో కొనసాగుతున్న షార్ట్ కవరింగ్, విదేశీ పెట్టుబడిదారుల లాభాల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయి పై అదనపు ఒత్తిడిని కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చల పై స్పష్టత లేకపోవడం కూడా రూపాయి బలహీనతకు మరో కారణంగా కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే, రూపాయి విలువ 91 వరకు పడిపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. ఉదయం 10.30 గంటల సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు పడిపోయి 84,897 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు నష్టంతో 25,928 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ప్రారంభమవుతోంది. డిసెంబర్ 5 న వడ్డీ రేట్ల పై నిర్ణయం వెలువడనుండగా, కీలక వడ్డీ రేట్లలో కోతకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!