

అంతర్జాతీయ ఆర్థిక, బులియన్ మార్కెట్లలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సింగపూర్ కీలక అడుగు వేసింది. ఏకంగా 500 టన్నుల బంగారాన్ని నిల్వ చేసే సామర్థ్యం కలిగిన అత్యాధునిక గోల్డ్ వాల్ట్ సేవలను సింగపూర్ మానిటరీ అథారిటీ (MAS) ప్రారంభించింది. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు, సార్వభౌమ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త వాల్ట్‌తో పాటు బంగారం కస్టడీ, రిఫైనింగ్, రీ-మెల్టింగ్, అసేయింగ్, బ్రోకింగ్ వంటి టోకు సేవలకు పన్ను మినహాయింపులను కూడా సింగపూర్ ప్రకటించింది. అంతర్జాతీయ సంస్థాగత వర్తకుల మధ్య జరిగే లావాదేవీలకు పన్ను విధానాన్ని సులభతరం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమని MAS ఛైర్మన్ గన్ కిమ్ యోంగ్ తెలిపారు. ఈ చర్యలు ఆసియాలో ప్రధాన ఆర్థిక, బంగారం ట్రేడింగ్ కేంద్రంగా సింగపూర్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.
ఆసియాలో అగ్రగామి గోల్డ్ హబ్‌గా ఎదిగేందుకు సింగపూర్, హాంకాంగ్ మధ్య పోటీ పెరుగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా 2027 రెండో త్రైమాసికంలో భౌతికంగా డెలివరీ చేయగల ఒక కిలో బంగారం బార్ ఫ్యూచర్స్‌ను ప్రవేశపెట్టాలని సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఓవర్-ది-కౌంటర్ (OTC) గోల్డ్ క్లియరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, 2027 మార్చి నాటికి పూర్తిస్థాయి ట్రేడింగ్ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్యలతో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడటంతో పాటు సింగపూర్ ఆర్థిక రంగానికి మరింత ఊతం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆసియా, పాశ్చాత్య దేశాల బంగారం మార్కెట్ల మధ్య సింగపూర్ కీలక వారధిగా మారి, అంతర్జాతీయ బులియన్ ట్రేడింగ్‌లో తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!