

ఇటీవలి రోజుల్లో వెండి ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో మదుపర్లలో అయోమయం పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.10 గ్రాములు) వెండి ధర తొలిసారిగా 100 డాలర్లను దాటగా, దేశీయంగా కిలో వెండి ధర రూ.3,33,000 కు పైగా చేరింది. ఈ పరిస్థితుల్లో ధరలు ఇంకా పెరుగుతాయా, లేక కొంత తగ్గుతాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే వెండి కొనుగోలు చేసినవారు అమ్మాలా, ఇంకా నిల్వ ఉంచాలా అనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు వెంటనే కొనాలా లేదా కొంతకాలం ఆగాలా అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విశ్లేషకుల అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గత ఐదు దశాబ్దాలుగా వెండి ధరలు పెద్దగా కదలకుండా ఉండగా, చాలా కాలం పాటు దాని వాస్తవ విలువకు కంటే తక్కువ స్థాయిలోనే కొనసాగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం వెండి ఒక కీలకమైన, వ్యూహాత్మకమైన, ప్రత్యామ్నాయం లేని పారిశ్రామిక లోహంగా మారిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన సాధనంగా స్థానం సంపాదించుకుంది.
గత ఐదేళ్లుగా కొనసాగుతున్న సరఫరా కొరత కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. సరఫరాతో పోలిస్తే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెండి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెండి నిల్వలను పెంచుకుంటూ, సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. జాతీయ భద్రత, ఇంధన స్వాతంత్ర్యం, సాంకేతిక సార్వభౌమత్వం వంటి అంశాల్లో వెండి కీలక పాత్ర పోషిస్తుండటం ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ముందు రోజుల్లో వెండి గిరాకీ తగ్గుతుందా అనే సందేహాలు ఉన్నప్పటికీ, పరిశ్రమలు వెండిని వినియోగించకుండా ఉండలేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో వెండి అనివార్యంగా మారిందని, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే తప్ప డిమాండ్ తగ్గే అవకాశం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!