

బంగారంపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేయడంతో గిరాకీ, వాణిజ్య లోటు, విదేశీ మారక నిల్వలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న చర్చ పరిశ్రమ వర్గాల్లో మొదలైంది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలో బంగారం బిస్కెట్లు, నాణేలు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. వరల్డ్గోల్డ్కౌన్సిల్ నివేదిక ప్రకారం దేశీయంగా బంగారంపై పెట్టుబడులు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. పన్ను భారం పెరిగినా పెట్టుబడుల గిరాకీపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎగుమతుల కోసం సుంకం లేకుండా దిగుమతి చేసుకునే బంగారానికి భారీ బ్యాంక్ గ్యారెంటీలు అవసరమవుతుండటంతో చిన్న వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి.
2019 నుంచి భారత్ ఏటా 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది. తాజా సుంకాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు 10% వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆభరణాల కొనుగోళ్లపై 10-15% ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు అధిక సుంకాల కారణంగా బంగారం స్మగ్లింగ్, బిల్లు లేకుండా అమ్మకాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలతో పాటు కేరళ విమానాశ్రయాల్లో నిఘా మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. యూఏఈతో ఉన్న వాణిజ్య ఒప్పందాల కారణంగా దుబాయ్ నుంచి బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని జీటీఆర్ఐ అంచనా వేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!