

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ రంగ అంకుర సంస్థల జాబితాలో ఏడో స్థానాన్ని సాధించింది. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ సంస్థ మార్కెట్ విలువ సుమారు 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,30,000 కోట్లు)గా అంచనా వేయబడింది. ఒక సంస్థ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లను దాటితే దానిని ‘హెక్టాకార్న్’గా పిలుస్తారు. దీంతో రిలయన్స్ రిటైల్ ఇప్పుడు హెక్టాకార్న్ హోదాను సంపాదించిన సంస్థగా నిలిచింది. ప్రపంచంలోని అగ్రగామి 7 అంకుర సంస్థల్లో రిటైల్ రంగం నుంచి చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా రిలయన్స్ రిటైల్ ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం మూడు సంస్థలు చోటు దక్కించుకోగా, వాటిలో రిలయన్స్ రిటైల్ ముందంజలో ఉంది. 24 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2,25,000 కోట్లు) విలువతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 27వ స్థానంలో, 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్లు) విలువతో టాటా ఈవీ మొబిలిటీ 93వ స్థానంలో నిలిచాయి. 2026 జనవరి వరకు ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇందులో తొలి మూడు స్థానాల్లో కృత్రిమ మేధ సంస్థలు ఓపెన్ ఏఐ, స్పేస్ ఎక్స్, ఆంథ్రోపిక్ ఉన్నాయి. జాబితాలోని 100 సంస్థల మొత్తం మార్కెట్ విలువలో ఈ మూడు కంపెనీల వాటానే దాదాపు మూడొంతులుగా నివేదిక వెల్లడించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!