

దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు పై హెచ్చరికలు చేయడం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి పెద్ద కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. మంగళవారం ట్రేడింగ్‌లో ఒక దశలో సెన్సెక్స్ 540 పాయింట్ల వరకు పడిపోయి 85,000 కీలక స్థాయిని కోల్పోయింది. చివరి గంటల్లో స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ, సెన్సెక్స్ 376.28 పాయింట్ల నష్టంతో 85,063.34 వద్ద ముగిసింది.
అదే సమయంలో నిఫ్టీ 50 కూడా 71.60 పాయింట్లు తగ్గి 26,178.70 వద్ద స్థిరపడింది. ఈ పతనంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.1.21 లక్షల కోట్లు తగ్గి రూ.479.59 లక్షల కోట్లకు చేరింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో ఒక దశలో 5 శాతం వరకు పడిపోయి రూ.1,497.05 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇది గడిచిన ఎనిమిది నెలలకుపైగా కాలంలో ఆ షేరుకు నమోదైన అతిపెద్ద ఇంట్రాడే నష్టంగా నిలిచింది. చివరికి షేరు 4.42 శాతం నష్టంతో రూ.1,507.70 వద్ద ముగియగా, కంపెనీ మార్కెట్ విలువ రూ.94,388.99 కోట్ల మేర తగ్గి రూ.20.40 లక్షల కోట్లకు పరిమితమైంది.
ఇదిలా ఉండగా, రష్యా నుంచి మూడు నౌకల ముడి చమురు జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీకి తరలివస్తోందని బ్లూంబర్గ్ లో వచ్చిన కథనాన్ని రిలయన్స్ ఖండించింది. గత మూడు వారాలుగా రష్యా నుంచి ముడి చమురు అందుకోలేదని, ఈ నెలలో కూడా అలాంటి అవకాశం లేదని సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ, షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడం గమనార్హం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!