

విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు ఆర్‌బీఐ చేపట్టిన చర్యలు అంచనాలకు మించిన ఫలితాలను ఇచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 31తో ముగిసిన ఫారెక్స్ మార్పిడి వసతి ద్వారా భారత బ్యాంకులు ప్రవాస భారతీయుల నుంచి ఏకంగా 12,723 కోట్ల డాలర్ల విలువైన ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లను ఆకర్షించాయి. ఈ వివరాలను ఆర్‌బీఐ బుధవారం వెల్లడించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ నిధులను ఆకర్షించేందుకు ఈ ఏడాది మేలో ద్రవ్యపరపతి సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉన్న ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్ల సమీకరణలో బ్యాంకులు ఎదుర్కొనే పూర్తి హెడ్జింగ్ ఖర్చులను భరించేందుకు ఆర్‌బీఐ ముందుకొచ్చింది. ప్రభుత్వ సంస్థలు విదేశీ రుణాలు సమీకరించే సమయంలో ఫారెక్స్ మార్పిడిపై రాయితీ కల్పించడంతోపాటు మరికొన్ని చర్యలను కూడా ప్రకటించింది. ఈ రాయితీ వసతులు జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్ల ద్వారా ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు, ఓసీఐలు తమ నిధులను భారత కరెన్సీలోకి మార్చకుండానే విదేశీ కరెన్సీలో పొదుపు చేసుకుని వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లతోపాటు ఓఎఫ్‌సీబీలు, ఈసీబీల ద్వారా ఆగస్టు 31 నాటికి మొత్తం 13,637.7 కోట్ల డాలర్ల విదేశీ నిధులు దేశానికి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇందులో ఓఎఫ్‌సీబీల ద్వారా 526 కోట్ల డాలర్లు, ఈసీబీల ద్వారా 389.1 కోట్ల డాలర్లు సమకూరాయి. ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లకు అనూహ్య స్పందన రావడంతో ఈ వసతి గడువును తొలుత ప్రకటించిన ఈ నెల 30 నుంచి ఆగస్టు 31కే కుదించారు. ఈసీబీ, ఓఎఫ్‌సీబీలకు ఫారెక్స్ రాయితీ వసతి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!