

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు కూడా బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో కుదిపేయగలవో ‘డియర్ యూ’ మరోసారి నిరూపించినట్టు తెలుస్తోంది. హాంగ్‌చున్ లాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చైనీస్ చిత్రం 2026 ఏప్రిల్ 30న చైనా థియేటర్లలో విడుదలైంది. సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారత కరెన్సీలో దాదాపు రూ.132 కోట్ల పెట్టుబడితో రూపొందినట్టు సమాచారం. అయితే విడుదల తర్వాత ఈ సినిమా వసూళ్లు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. చైనా బాక్సాఫీస్‌లో ఇప్పటికే 300 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.2,849 కోట్లకు సమానం. భారీ స్టార్ హీరోలు, అత్యంత ఖరీదైన దృశ్యాలు లేకుండానే కంటెంట్ బలంతో ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2026లో ఊహించని విజయాల్లో ‘డియర్ యూ’ ఒకటిగా నిలిచింది.
‘డియర్ యూ’ అనే టైటిల్‌కు చైనీస్ భాషలో అమ్మమ్మకు ప్రేమలేఖ అనే అర్థం వస్తుంది. ఈ సినిమా కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను ప్రధానంగా చేసుకుని రూపొందిన ఫ్యామిలీ డ్రామాగా సమాచారం. అప్పులు, కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న చైనాకు చెందిన ఓ వ్యక్తి, కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతుక్కుంటూ థాయ్‌లాండ్‌కు వెళ్లడంతో కథ మొదలవుతుంది. అక్కడ అతడికి ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన హృదయవిదారకమైన నిజం తెలుస్తుంది. ఆ రహస్యం ఏమిటి, దాని నుంచి అతడు ఎలా బయటపడతాడనేది కథలో కీలక అంశంగా ఉంటుంది. చైనాలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 4న ఉత్తర అమెరికాలో విడుదల కానుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన కథ కావడంతో అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!