

1969లో జిల్లా స్థాయి అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం కోసం ప్రవేశపెట్టిన లీడ్ బ్యాంక్ పథకంలో మార్పులు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ మేరకు పథకం లక్ష్యాలు, నిర్మాణం, సభ్యత్వం, వివిధ వేదికల అజెండాలు, కీలక అధికారుల బాధ్యతలపై సవరణలతో ముసాయిదాను విడుదల చేసింది. బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, ఇతర అభివృద్ధి సంస్థల మధ్య సమన్వయం పెంచి ప్రాధాన్య రంగాలకు రుణాల ప్రవాహాన్ని మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మరియు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్యాలయాలను బలోపేతం చేయనున్నారు. ప్రతి జిల్లాకు ఒక వాణిజ్య బ్యాంకును లీడ్ బ్యాంక్‌గా నియమిస్తూ, రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలను ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్యాంకులు సమన్వయం చేస్తాయి. రుణ మంజూరులో ఎదురయ్యే సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి పరిష్కరించడంపై దృష్టి సారించనున్నారు. రోడ్లు, డిజిటల్ కనెక్టివిటీ, శాంతిభద్రతలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి ప్రతి ప్రాంతానికి బ్యాంకింగ్ సేవలు అందేలా చూడాలని ముసాయిదాలో సూచించారు. రుణ ప్రణాళికలు క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా రూపొందించాలనేది ప్రధాన సిఫార్సుగా పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!