

ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ లాభం 13 శాతం పెరిగి రూ.5,100 కోట్లకు చేరింది. ఇది ఒకే త్రైమాసికంలో పీఎన్బీ సాధించిన అత్యధిక లాభంగా బ్యాంక్ పేర్కొంది. మొండి బకాయిలు (ఎన్పీఏలు) తగ్గడమే ఈ లాభాల వృద్ధికి ప్రధాన కారణమని వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ లాభం రూ.4,508 కోట్లుగా నమోదైంది.
ఈ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇకపై ప్రతి త్రైమాసికంలో రూ.5,000 కోట్లకు పైగా లాభం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర తెలిపారు. అదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.34,752 కోట్ల నుంచి రూ.37,253 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ సంస్థలకు ఇచ్చిన సమాచారం లో వెల్లడించింది.
గత ఏడాది డిసెంబర్ 31 నాటికి స్థూల మొండి బకాయిల నిష్పత్తి 4.09 శాతం నుంచి 3.19 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 0.41 శాతం నుంచి 0.32 శాతానికి పడిపోయాయి. ఎన్పీఏలు తగ్గడంతో కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గి, గతేడాది రూ.1,341 కోట్లుగా ఉన్నవి ఈ త్రైమాసికంలో రూ.318 కోట్లకు పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!