

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ‘వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.8,175 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. విద్యుత్ నిల్వ కోసం ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)కు అవసరమైన బ్యాటరీలను ఇక్కడ తయారు చేస్తారు. 16 గిగావాట్ అవర్ సామర్థ్యంతో లిథియం అయాన్ సెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఒకే ప్రదేశంలో సెల్, ప్యాక్ తయారీతో పాటు ఎనర్జీ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు మొదటి దశను 2027 జూలై నాటికి పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సుమారు 3,000 మందికి ఉపాధి కల్పించనుండగా, ప్రభుత్వం దాదాపు 300 ఎకరాల భూమిని కేటాయించింది.
ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో 20 గిగావాట్ అవర్ సామర్థ్యానికి విస్తరించే ప్రణాళిక సంస్థకు ఉంది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీలు, బ్యాటరీ ప్యాక్‌ల తయారీపై ప్రధాన దృష్టి పెట్టిన వారీ సంస్థ, భవిష్యత్తులో ఇతర ఇంధన నిల్వ సాంకేతికతలపై కూడా పరిశోధనలు చేస్తోంది. గుజరాత్ మరియు అమెరికాలోని టెక్సాస్‌లో ఇప్పటికే 14.9 గిగావాట్ సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఈ సంస్థ, 30కిపైగా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. సోలార్ తయారీ నుంచి ఎనర్జీ స్టోరేజ్ రంగానికి విస్తరిస్తూ, యుటిలిటీ, గ్రిడ్ మరియు పునరుత్పాదక ఇంధన అనుసంధానానికి ఈ ప్రాజెక్టు కీలకంగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!