దేశంలోనే అతిపెద్ద తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)గా నిలవబోయే రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత నవంబరులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ జియో విలువను 180 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16.20 లక్షల కోట్లు)గా అంచనా వేసింది. జియోలో 2.5 శాతం వాటా విక్రయించాలని రిలయన్స్ భావిస్తుండగా, దీని ద్వారా 4 నుంచి 4.5 బిలియన్ డాలర్లు (రూ.36,000–40,500 కోట్లు) వరకు సమీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా వినియోగదారులతో జియో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా కొనసాగుతోంది.
గత ఆరేళ్లలో జియో కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి ఆధునిక రంగాల్లోకి విస్తరించింది. కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వంటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి భారీగా నిధులు సమీకరించింది. జియో ఐపీఓ కోసం మదుపర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తుండగా, 2026 ప్రథమార్థంలోనే ఐపీఓ రావచ్చని గత ఆగస్టులో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ముకేశ్ అంబానీ ప్రకటించారు. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ భారీ ఐపీఓకు తుది రూపం ఇవ్వనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.

ఐపీఓ ముసాయిదా తయారీలో మోర్గాన్ స్టాన్లీ, కోటక్ బ్యాంకర్లు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్ద కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలంటే కనీసం 5 శాతం వాటా విక్రయించాల్సి ఉండగా, ఈ పరిమితిని 2.5 శాతానికి తగ్గించాలని సెబీ ప్రతిపాదించింది. దీనికి ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. జియో పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 2.5 శాతం వాటానే విక్రయించాలని రిలయన్స్ భావిస్తోంది. జియో విలువను 200–240 బిలియన్ డాలర్లు (రూ.18–21.60 లక్షల కోట్లు)గా అంచనా వేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉండగా, ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఉంటుందా లేక కొత్త షేర్ల జారీ జరుగుతుందా అన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.


.jpg&w=3840&q=75)






.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!