

త్వరలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనిపై సామాన్య ప్రజలు ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతేడాది పన్ను తగ్గింపులతో వేతన జీవులకు ఊరట కలిగించిన ప్రభుత్వం, పాత పన్ను విధానాన్ని అనుసరించే వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026 లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? లేక ప్రజలకు మేలు చేసే మార్పులు తీసుకొస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
గత బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేలుగా పెంచడం, సెక్షన్ 87ఏ రిబేట్‌ను రూ.60 వేల వరకు పెంచడం వల్ల మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరట లభించింది. రూ.12 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారికి పన్ను భారం లేకుండా మారింది. అయితే పాత పన్ను విధానంలోని స్లాబ్స్, డిడక్షన్లు, మినహాయింపులు మాత్రం ఎలాంటి మార్పులేకుండా కొనసాగాయి. ఈ ఏడాది బడ్జెట్లో పాత పన్ను విధానంలోని సెక్షన్ 80సీ, 80డీ, హోమ్ లోన్ వడ్డీ, ఎన్పీఎస్ వంటి ప్రయోజనాల్లో మార్పులు వస్తాయా? లేక ఆ విధానానికి ముగింపు పలుకుతారా? అనే అంశంపై చర్చలు పెరిగాయి. అలాగే కొత్త పన్ను విధానంలో ఇన్సూరెన్స్, రిటైర్మెంట్, స్థిరాస్తి పెట్టుబడులకు కొంతమేర మినహాయింపులు చేర్చే అవకాశముందని అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో ఆదాయపు పన్ను నిబంధనలను సులభతరం చేయడం, ఐటీఆర్ రిఫండ్స్ వేగవంతం చేయడం, టీడీఎస్ సమస్యలు, ఐటీ నోటీసులపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక స్లాబ్స్, అధిక రిబేట్లు, ఆరోగ్య ఖర్చులపై మినహాయింపులు కల్పించాలన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి భారీ పన్ను కోతలు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్త పన్ను విధానాన్ని మరింత సరళంగా, సమతుల్యంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!