

ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ, ఐవీఎఫ్ మరియు గైనకాలజీ చికిత్సల్లో సూది అవసరం లేని ఇంజెక్షన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఇంటెగ్రిమెడికల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో భారత్లో ఈ ఆధునిక చికిత్సను అందించే ఏకైక సంస్థగా ఇంటాస్ ఫార్మాకు గుర్తింపు లభించనుంది. ఇది కేవలం ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేయడమే కాకుండా, లక్షలాది మంది రోగులకు ఉపశమనాన్ని అందించే కీలక ముందడుగుగా సంస్థ పేర్కొంది.
ఇంటాస్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా పి. సతపతి మాట్లాడుతూ, ఐవీఎఫ్ మరియు గైనకాలజీ చికిత్సల్లో సులభమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన విధానాలను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం భారత్లో ఐవీఎఫ్ రంగం వేగంగా విస్తరిస్తోందని, ఏటా సుమారు 3 నుంచి 5 లక్షల ఐవీఎఫ్ సైకిల్స్ జరుగుతుండగా, 2027 నాటికి ఇవి 5 నుంచి 6 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఈ నేపథ్యంలో సూది లేని ఇంజెక్షన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా లక్షలాది మంది రోగులకు నొప్పి లేకుండా చికిత్స అందించే అవకాశం ఏర్పడనుంది. ఈ నూతన ఎన్-ఎఫ్ఐఎస్ (Needle Free Injection System) టెక్నాలజీలో, అధిక పీడనంతో మందును సూక్ష్మ రంధ్రం ద్వారా చర్మం గుండా శరీరంలోకి పంపిస్తారు. దీని వల్ల సూది వల్ల కలిగే నొప్పి, భయం లేకుండా మందు అందించడం సాధ్యమవుతుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!