

దేశీయ ఐటీ కంపెనీలకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయంలో ఏఐ సేవల వాటా 8 శాతంగా నమోదైందని, త్రైమాసిక ప్రాతిపదికన రెండంకెల వృద్ధి కనిపిస్తోందని వెల్లడించారు. వచ్చే రెండుమూడేళ్లలో కంపెనీ ఆదాయంలో దాదాపు సగం ఏఐ సేవల నుంచే వచ్చే అవకాశం ఉందన్నారు. ఏఐ ఏజెంట్ల అభివృద్ధి, కోడింగ్ టూల్స్, పాత సాంకేతిక వ్యవస్థల ఆధునికీకరణకు సంబంధించిన పనులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం వ్యాపారంలో చిన్న వాటాగా ఉన్న ఈ కార్యకలాపాలు రాబోయే కొన్ని త్రైమాసికాల్లో 20–30 శాతానికి చేరవచ్చని అంచనా వేశారు. గత ఏడాది 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నామని, ఈసారి మరో 20 వేల మందిని తీసుకుని ఏఐలో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. ఇన్ఫోసిస్‌లోని మూడు లక్షల మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 80 వేల మంది కోడింగ్ టూల్స్, అంతర్గత ప్రాజెక్టులపై పనిచేస్తున్నారని వివరించారు.
మరోవైపు, ఏఐ కారణంగా దేశీయ ఐటీ సేవల రంగంలో భారీగా ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తోసిపుచ్చారు. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ఏఐలోకి వస్తున్న భారీ పెట్టుబడులకు సంబంధించిన మార్కెటింగ్‌లో భాగమని వ్యాఖ్యానించారు. వ్యాపార సంస్థలు ఏఐ పరివర్తనను చేపట్టే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐటీ సంస్థలు కొత్త సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఉద్యోగులకు ఆధునిక సాంకేతికతల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!