

భారత్ స్వదేశీ ఐదో తరం యుద్ధ విమానాల తయారీ లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్‌డ్ మిడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖ మూడు ప్రధాన కంపెనీలకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేసింది. ఎల్ అండ్ టీ, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, భారత్ ఫోర్జ్ ఈ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఎల్ అండ్ టీ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోగా, భారత్ ఫోర్జ్ బీఈఎంఎల్‌తో చేతులు కలిపింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)ను ఈ ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉంచడం విశేషంగా మారింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు సమాన అవకాశాలు కల్పించే పోటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
భారత రక్షణ రంగ చరిత్రలో AMCA ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా భావిస్తున్నారు. 2030ల మధ్య నాటికి భారత వైమానిక దళానికి ఇది ప్రధాన బలంగా మారనుందని అంచనా. రెండు ఇంజిన్లతో రూపొందుతున్న ఈ స్టెల్త్ ఫైటర్ జెట్‌లో అధునాతన సెన్సర్ ఫ్యూజన్, అంతర్గత ఆయుధ నిల్వ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికత, నెట్‌వర్క్ కేంద్రీకృత యుద్ధ సామర్థ్యాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో రూ.15,803 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల శంకుస్థాపన చేశారు. ఎంపికైన సంస్థ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీతో కలిసి ఐదు ప్రోటోటైప్ విమానాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. GE F414 ఇంజిన్‌తో తొలి ప్రోటోటైప్‌ను 2029 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!