

భారతీయ కుటుంబాల వినియోగపు అలవాట్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొత్తం కుటుంబ వినియోగ వ్యయంలో ఆహార పదార్థాల వాటా 32.82 శాతానికి తగ్గగా, మిగిలిన దాదాపు 67 శాతం ఇతర వస్తువులు, సేవల కోసం ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆన్‌లైన్ కొనుగోళ్లు విస్తరిస్తున్నప్పటికీ తాజా కూరగాయలు, పండ్ల కోసం చాలామంది సంప్రదాయ మార్కెట్లనే ఆశ్రయిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా విభాగం విడుదల చేసిన ‘ఇండియాస్ కన్జంప్షన్ జర్నీ’ నివేదిక ఈ ధోరణులను వెల్లడించింది. ఎంపిక చేసిన ప్రొటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలపై సగటు నెలవారీ కుటుంబ వ్యయంలో సిక్కిం రూ.1,776తో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.979, తెలంగాణలో రూ.959గా నమోదైంది. ఒడిశాలో ఈ ఖర్చు అత్యల్పంగా రూ.656గా ఉంది.
వంటకు ప్రధాన ఇంధనంగా ఎల్‌పీజీని వినియోగిస్తున్న కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌లో 87.8 శాతం, తెలంగాణలో 84.4 శాతంగా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం ఆహార వ్యయంలో 16.3 శాతం హోటళ్లు, ఇతర ఆహార కేంద్రాల్లో తయారైన లేదా తినేందుకు సిద్ధంగా ఉన్న పదార్థాలపై ఖర్చు చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. వృద్ధులు ఎక్కువగా ఉన్న కుటుంబాలు పాలు, పండ్లు, కూరగాయలపై అధికంగా ఖర్చు చేస్తుండగా, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాలు పాల ఉత్పత్తులు, సిద్ధంగా లభించే ఆహార పదార్థాలపై ఎక్కువ వ్యయం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 45.6 శాతం కుటుంబాలు కనీసం ఒక వినియోగ వస్తువు కొనుగోలు లేదా చెల్లింపు కోసం ఆన్‌లైన్ వేదికలను ఉపయోగిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ కొనుగోళ్లలో ఆహార పదార్థాల వాటా కేవలం 7.10 శాతమే కాగా, వినియోగ వస్తువులు, సేవల వాటా 39.68 శాతంగా ఉంది. దుస్తుల కొనుగోళ్లలో ఆన్‌లైన్ వాటా 19.97 శాతం, పాదరక్షల్లో 12.05 శాతంగా నమోదైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!