

బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు ‘మిస్టర్ రోబోట్’ అనే సైబర్ నేర ముఠా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ భద్రతా సంస్థ క్లౌడ్‌సెక్ గుర్తించింది. ఈ ముఠా ఇతర నేరగాళ్లకు కూడా మాల్‌వేర్‌ను అద్దెకిస్తూ, మోసాలకు అవసరమైన సాధనాలను అందిస్తున్నట్లు తన పరిశోధనలో వెల్లడించింది. సుమారు 36 రకాల నకిలీ యాప్‌లను రూపొందించగా, వాటిలో 9 యాప్‌లు బ్యాంకుల పేర్లతో ఉన్నట్లు తెలిపింది. గ్యాస్, నీరు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీఛార్జీలు, ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు సేవల పేరుతోనూ నకిలీ యాప్‌లను తయారు చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ చెల్లించాలంటూ రూ.9-10 రుసుము అడిగి, ఆ ప్రక్రియలో పాన్ నంబరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబరు వంటి వివరాలను సేకరిస్తున్నారు.
ఈ ముఠా టెలిగ్రామ్ బాట్, వెబ్ ఆధారిత కంట్రోల్ ప్యానెల్ ద్వారా ఇతర నేరగాళ్లకు నకిలీ యాప్‌లను రూపొందించే సదుపాయం కల్పిస్తోంది. ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాని ఐకాన్ కనిపించకుండా పోయినా, అది బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ బ్యాంకు ఓటీపీలను తస్కరించగలదు. ఆధార్, పాన్, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ, ఏటీఎం, యూపీఐ పిన్‌లు, నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను కూడా సేకరించవచ్చు. అంతేకాకుండా బ్యాంకు నుంచి వచ్చే కాల్స్‌ను మరో నంబరుకు మళ్లించి, మోసపూరిత లావాదేవీలపై వచ్చే హెచ్చరికలు ఖాతాదారులకు చేరకుండా చేయవచ్చు. భద్రతా వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు మాల్‌వేర్ కనీసం 48 గంటలు లేదా యాప్‌ను మూడుసార్లు తెరిచే వరకు వేచి ఉండే అవకాశం ఉందని క్లౌడ్‌సెక్ తెలిపింది. ఈ నేపథ్యంలో యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్ వంటి అధికారిక వేదికల నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలని, అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని సూచించింది. ఫోన్‌లో తెలియని మార్పులు కనిపించినా, బ్యాంకు కాల్స్ ఆగిపోయినా వెంటనే బ్యాంకును సంప్రదించి ఖాతా భద్రతకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!