

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ మరింత బలపడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుఫాన్ నవంబర్ 2 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 3 ఉదయం నెల్లూరు–నరసాపురం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నవంబర్ 2న ఐదు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖతో పాటు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!