

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘కేసీఆర్ పాదయాత్ర దేనికి? మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ ఎలా కూలిందో చూపించడానికా? లేక రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి నార్లాపూర్ పంపుహౌస్‌లో ఒక్క పంపు తిప్పినందుకా?’ అని ప్రశ్నించారు. సోమవారం శాసనసభ ప్రాంగణంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. ప్రాజెక్టుల సందర్శన పేరుతో భారీగా జన సమీకరణకు కేసీఆర్ సిద్ధమవుతున్నారన్న ప్రచారాన్ని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం బ్యారేజీల భద్రతే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ప్రజలను ప్రాజెక్టుల వద్దకు తీసుకెళ్లి ఏం చూపిస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దుస్థితిపై భారాస ముందుగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు పంపులు నడపాలో, ఎప్పుడు నీటిని ఎత్తిపోయాలో తమకు తెలుసన్నారు. నీటిపారుదల సలహాదారుగా ఎవరిని నియమించుకోవాలో మంత్రిగా తానే నిర్ణయిస్తానని, ఆదిత్యనాథ్ దాస్‌ను ఎందుకు నియమిస్తున్నారంటూ ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో భాషా ప్రమాణాలు దిగజారడానికి కేసీఆరే కారణమని ఆయన ఆరోపించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!