

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. ఇటీవల కొంతకాలం స్థిరంగా కనిపించిన ధరలు మంగళవారం ఒక్కసారిగా జోరు పెంచాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వివరాల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ. 1,40,850 కి చేరి కొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది.
హైదరాబాద్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాముల ధర రూ. 2,400 పెరిగి రూ. 1,38,650 కు చేరింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 2,200 పెరిగి రూ. 1,27,000 గా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మొత్తం 78.40 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వెండి ధరలు కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతున్నాయి. కిలో వెండి ధర రూ. 3,000 పెరిగి (అన్ని పన్నులతో కలిపి) రూ. 2,34,000కి చేరి చరిత్రలోనే గరిష్ఠ స్థాయిని అందుకుంది. గడిచిన ఒక ఏడాదిలో వెండి ధరలు 142 శాతానికి పైగా పెరగడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 4,498 డాలర్లకు చేరగా, వెండి ఔన్స్ ధర తొలిసారిగా 70 డాలర్ల మైలురాయిని దాటింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను మరింత పైకి నడిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!