

దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రూ.3,000గా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5 శాతం పెంపు చేయడంతో, ఇకపై ఇది రూ.3,075గా ఉండనుంది. ఈ కొత్త ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది.
అయితే ఫాస్టాగ్ వినియోగదారులకు ఒక అవకాశం కూడా ఇచ్చింది. ఈ నెల 31లోగా రీఛార్జ్ చేసుకుంటే ప్రస్తుత ధరలైన రూ.3,000కే వార్షిక పాస్ పొందవచ్చు. ఒకసారి ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజాల వరకు ఆగకుండా ప్రయాణించే సౌకర్యం లభిస్తుంది (ఏది ముందుగా పూర్తైతే అది వర్తిస్తుంది). అవసరమైతే ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగానే ఈ పెంపు చేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. 2026 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు సుమారు 52 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!