

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil ambani) మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముమ్మర దర్యాప్తు నిర్వహిస్తోంది. దీనిలోభాగంగా మరో రూ.1,120 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. దాంతో ఈడీ ఇప్పటివరకు ఆయనకు చెందిన రూ.10వేల కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసినట్లయింది.
ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ వంటివి అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. గతంలో ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలోని అనిల్ అంబానీ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్‌కు చెందిన కొంత భూమిని ఈడీ (Enforcement Directorate) అటాచ్ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, తూర్పుగోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో రిలయన్స్ గ్రూప్‌లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆగస్టులో అనిల్ అంబానీ సహా కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్ అధికారులను విచారించిన సంగతి తెలిసిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!