

ఆరు పదుల వయసు చేరుకునే సరికి చాలా మందికి స్థిరమైన ఆదాయం ఉండదు. ఆ సమయంలో పని చేయాలన్నా శారీరకంగా, మానసికంగా సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే పదవీ విరమణ సమయానికి ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం ముప్పై ఐదు సంవత్సరాల వయసు నుంచే ముందస్తు ప్రణాళికతో పొదుపు ప్రారంభించాలి. ఖర్చుల కంటే పొదుపును ప్రాధాన్యంగా తీసుకుని, సరైన పెట్టుబడుల్లో డబ్బును పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తగ్గుతాయి.
ప్రస్తుతం ఉన్న ఆదాయం, ఖర్చులు, అప్పులు, బాధ్యతలపై స్పష్టమైన అంచనా వేసుకోవడం చాలా ముఖ్యమైనది. అనుకోని పరిస్థితుల కోసం అత్యవసర నిధిని సిద్ధంగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల భద్రత కోసం జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. పెట్టుబడుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించి, అవసరమైతే మార్పులు చేయాలి. అలాగే అప్పులు, ఈఎంఐలను తగ్గించుకోవడం ద్వారా పొదుపు పెంచుకోవచ్చు.
పెట్టుబడులు చేసే విషయంలో వివిధ మార్గాలను అనుసరించడం మంచిది. దీర్ఘకాలంలో మంచి ఫలితాల కోసం కొంత భాగాన్ని ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి చేయవచ్చు. మిగిలిన భాగాన్ని స్థిర ఆదాయం ఇచ్చే పథకాల్లో పెట్టాలి. రిస్క్ సామర్థ్యాన్ని బట్టి బంగారం, స్థిర నిక్షేపాలు, ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు చేయవచ్చు. ఒకే చోట మొత్తం డబ్బు పెట్టకుండా విభజించి పెట్టడం ద్వారా భద్రత పెరుగుతుంది. సరైన ప్రణాళికతో ముందుగానే చర్యలు తీసుకుంటే మలి వయసులో ఆర్థికంగా సురక్షితంగా జీవించవచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!