

ఎంపిక చేసిన యూపీఐ వ్యాపారి లావాదేవీలకు కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ గడువును 2027 జనవరి 1కి వాయిదా వేయనున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అధికారిక ప్రకటన వెలువడలేదు. కొత్త విధానం ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. వ్యాపారులకు చేసే రూ.2,000 వరకు చెల్లింపులపైనా ఎండీఆర్ ఉండదు. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారులకు కూడా జీరో ఎండీఆర్ కొనసాగుతుంది.
రూ.2,000కు మించిన నిర్దిష్ట పీ2ఎం లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి కీలక రంగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది. మూలధన మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. ఎండీఆర్ వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీ కాదని, చెల్లింపుల వ్యవస్థలోని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కావని తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!