

భారత్‌లో పసిడి డిమాండ్‌కు గణనీయంగా బ్రేక్ పడింది. ప్రపంచ స్వర్ణ మండలి (WGC) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 131.4 టన్నులకు పడిపోయింది. ఇది గత ఆరేళ్లలో కనిష్ఠ స్థాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డిమాండ్ 6 శాతం తగ్గింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం, సీజనల్ డిమాండ్ బలహీనంగా ఉండటం, విదేశీ మారక నిల్వల పరిరక్షణ కోసం అవసరమైతే తప్ప బంగారం కొనొద్దన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని డబ్ల్యూజీసీ తెలిపింది.
అయితే పరిమాణం తగ్గినా, విలువ పరంగా మాత్రం బంగారం అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ.1.98 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం అధికం. అధిక ధరలు ఉన్నప్పటికీ వినియోగదారులు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారని డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం భారత బంగారం డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉండే అవకాశముందని ఆయన అంచనా వేశారు.
దిగుమతి సుంకాల పెంపుతో బంగారం స్మగ్లింగ్ కూడా పెరిగిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. మే 13 నుంచి జూన్ చివరి వరకు స్వాధీనం చేసుకున్న బంగారం గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది. మరోవైపు నగల కోసం బంగారం వినియోగం 75.1 టన్నులకు తగ్గగా, పెట్టుబడుల కోసం కొనుగోలు మాత్రం 9 శాతం పెరిగి 50.3 టన్నులకు చేరింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఈ ఏడాది రెండో అర్థభాగంలో బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!