

కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల టెక్ రంగంలో లేఆఫ్‌లు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వచ్చిన ఓ నివేదిక కలకలం రేపింది. జనవరిలో 11 వేల నుంచి 22 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ఉండొచ్చని టిప్‌ర్యాంక్స్ సంస్థ నివేదిక పేర్కొనడంతో, అజ్యూర్ క్లౌడ్, ఎక్స్‌బాక్స్, గ్లోబల్ సేల్స్ వంటి విభాగాల్లో కోతలు ఉంటాయన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరుగుతున్న ఖర్చులు, ఏఐ పెట్టుబడులే ఇందుకు కారణమని ఆ నివేదిక పేర్కొంది.
అయితే ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్స్ షా స్పందిస్తూ, ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవేనని, లేఆఫ్‌ల సమాచారం తప్పని స్పష్టం చేశారు. విండోస్ సెంట్రల్ ఎడిటర్ జెజ్ కార్డన్ కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. ప్రస్తుతం దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
గతేడాది జులైలో మైక్రోసాఫ్ట్ సుమారు 9 వేల మందికి లేఆఫ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా అప్పటి కోతలు చేపట్టామని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో కొన్ని గేమ్ ప్రాజెక్ట్‌లను రద్దు చేసి, కొన్ని స్టూడియోలను మూసివేసింది. అదే ఏడాది జులై నాటికి మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకడం గమనార్హం.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!