

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకు అమెరికా కోర్టులో ఊరట లభించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్ (SEC) తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ గౌతమ్ అదానీతో పాటు ఆయన బంధువు సాగర్ అదానీ దాఖలు చేసిన వినతిపై విచారణ జరపడానికి అమెరికా కోర్టు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఈ కేసు అమెరికా న్యాయ పరిధిలోకి రాదని, అలాగే పలు అంశాల్లో ఎస్ఈసీ తగిన ఆధారాలు చూపించలేకపోయిందని అదానీ తరపు న్యాయవాదులు వాదించారు. ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనపై ఇరు పక్షాలు విచారణకు హాజరుకావాలని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ తన ఆదేశాల్లో పేర్కొంది. భారత్‌లో కాంట్రాక్టులు పొందేందుకు అదానీ గ్రూప్ అమెరికా మదుపర్ల సొమ్మును వినియోగించి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలకు సంబంధించి ఎస్ఈసీ విశ్వసనీయ ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని కూడా న్యాయవాదులు తెలిపారు.
ఈ కేసును ఎస్ఈసీ 2024 నవంబరులో నమోదు చేసింది. సౌర ఇంధన ప్రాజెక్టుల కాంట్రాక్టులను పొందేందుకు భారత్‌లో కొందరు పెద్దలకు సుమారు 250 మిలియన్ డాలర్లు లంచంగా చెల్లించారనే ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఈ విషయాన్ని సౌర ప్రాజెక్టుల కోసం నిధులు సమీకరించే సమయంలో అమెరికా పెట్టుబడిదారులు, బ్యాంకులకు వెల్లడించలేదని కూడా ఆరోపించింది. అయితే ఈ అన్ని ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ఇదే సమయంలో, ఇరాన్‌పై రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా మరియు ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకోవడంతో స్టాక్ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్, ఏసీసీ మరియు అదానీ పవర్ వంటి షేర్లు లాభాలు నమోదు చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!