

హైదరాబాద్‌కు చెందిన కాస్మోసర్వ్ స్పేస్ సంస్థ అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ‘మిషన్ ఎంబ్రేస్’ పేరిట ఉపగ్రహాలను సాఫ్ట్ రోబోటిక్ విధానంలో పట్టుకునే ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ పేలోడ్‌ను స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ద్వారా ‘మిషన్ ఆగమన్’లో భాగంగా జులై 12 నుంచి ఆగస్టు 4 మధ్య నింగికి పంపనున్నారు.
భూకక్ష్యలో వేలాది నిరుపయోగ ఉపగ్రహాలు పేరుకుపోవడంతో భవిష్యత్ ప్రయోగాలకు ముప్పు ఏర్పడుతోంది. దీనికి పరిష్కారంగా కాస్మోసర్వ్ రెండు వ్యోమనౌకల వ్యవస్థను రూపొందిస్తోంది. తక్కువ ఖర్చుతో వ్యర్థాలను సురక్షితంగా తొలగించే ఈ సాంకేతికత అస్తవ్యస్తంగా తిరిగే ఉపగ్రహాలను సున్నితంగా పట్టుకునేలా రూపొందించబడింది. సంస్థ సీఈఓ చిరంజీవి ఫణీంద్ర తెలిపిన వివరాల ప్రకారం, ఈ పరికరాన్ని నాలుగు నెలల్లో సిద్ధం చేసి, ఇస్రో మాజీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అన్ని పరీక్షలను పూర్తి చేశారు. ఈ మిషన్ భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!