

జీఎస్టీ రేట్ల సవరణతో పాటు ఈ ఏడాది విస్తృత వర్షాల కారణంగా ఎయిర్ కండిషనర్ల అమ్మకాలు తగ్గిపోవడంతో, పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఏసీల ధరలను గరిష్ఠంగా 10 శాతం వరకు తగ్గించాయి. అయితే, వచ్చే జనవరి నుంచి ఏసీల ధరలు మళ్లీ 3 నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తీసుకురాబోయే కొత్త విద్యుత్తు వినియోగ ప్రమాణాలే. ఏసీ కొనుగోలు పెద్ద సమస్య కాకపోయినా, వాటి వినియోగంతో వచ్చే విద్యుత్తు బిల్లు మాత్రం వినియోగదారులకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ విద్యుత్తు వినియోగించే ఏసీలకు బీఈఈ మెరుగైన స్టార్ రేటింగ్‌ను (గరిష్ఠంగా 5 స్టార్) ఇస్తోంది.
ఈ రేటింగ్ ప్రమాణాలను బీఈఈ కాలక్రమేణా సవరిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం 2026 జనవరి నుంచి కొత్త ప్రమాణాలకు అనుగుణంగానే ఏసీల తయారీ తప్పనిసరి కానుంది. దీని వల్ల తయారీలో మెరుగైన నాణ్యత గల ముడిపదార్థాలు ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే తయారీ విధానాల్లోనూ మార్పులు అవసరం అవుతాయి.
ఇదే సమయంలో ఏసీల తయారీలో ఉపయోగించే లోహాల ధరలు పెరగడం, విదేశాల నుంచి దిగుమతి చేసే విడిభాగాల పై రూపాయి విలువ తగ్గడం వల్ల ఖర్చు పెరిగిందని ఒక ప్రముఖ కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ కారణాల వల్ల ధరల పెంపు తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
విద్యుత్తు వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండే 3 స్టార్ ఏసీల ధరలు 3–4 శాతం పెరిగే అవకాశం ఉండగా, అత్యంత సమర్థవంతమైన 5 స్టార్ ఏసీల ధరలు 8–12 శాతం వరకు పెంచాలని కంపెనీలు అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఏసీల విక్రయాలు తగ్గిపోయాయి. సాధారణంగా జూలై–ఆగస్టు నాటికి కంపెనీల వద్ద ముడిపదార్థాల నిల్వలు తగ్గిపోతాయి. అయితే ఈసారి వర్షాల ప్రభావంతో కొన్ని పెద్ద కంపెనీల వద్ద పాత ముడిపదార్థాలు ఇంకా మిగిలే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డీలర్ల వద్ద కూడా ఏసీల స్టాక్ అధికంగానే ఉంది.
బీఈఈ ప్రకటించే కొత్త ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యే ఏసీలు మాత్రమే నిర్దేశిత తేదీ నుంచి మార్కెట్లోకి వస్తాయి. అయితే, డీలర్లు మరియు షోరూమ్‌లలో ఉన్న పాత స్టాక్‌ను పూర్తయ్యే వరకు విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!