

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాటరీల భద్రత మరియు పారదర్శకత కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఈవీ బ్యాటరీకి ఆధార్ కార్డు లాంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. దీనిని బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబర్ (బీపీఏఎన్) అని పిలుస్తారు. ఈ 21 అంకెల నంబర్ ద్వారా బ్యాటరీ తయారీ నుంచి వినియోగం, చివరికి రీసైక్లింగ్ వరకు అన్ని దశలను ట్రాక్ చేయవచ్చు. బ్యాటరీ తయారీదారులు లేదా దిగుమతిదారులు ప్రతి బ్యాటరీకి ఈ నంబర్ కేటాయించి, సంబంధిత వివరాలను ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ నంబర్ బ్యాటరీపై స్పష్టంగా కనిపించేలా ఉండాలి, కాలక్రమేణా చెరిగిపోకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాటరీని రీసైక్లింగ్ చేసినా లేదా ఇతర అవసరాలకు మార్చినా కొత్త నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2 కిలోవాట్ అవర్కి మించిన సామర్థ్యం ఉన్న బ్యాటరీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే వాహనాలు స్టార్ట్ చేయడానికి ఉపయోగించే ఎస్ఎల్ఐ బ్యాటరీలు, చిన్న పోర్టబుల్ బ్యాటరీలకు ఇది వర్తించదు. ఆల్ఫాన్యూమరిక్ కోడ్, క్యూఆర్ కోడ్, సర్వర్ ఆధారిత డేటా ద్వారా వినియోగదారులు, అధికారులు వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధానం వల్ల నకిలీ బ్యాటరీలకు చెక్ పడడమే కాకుండా, పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయడంలోనూ ఇది కీలకంగా మారనుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!