

ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌లో చైనా కార్ల తయారీ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు టయోటా, హోండా, నిస్సాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తయారీ ఖర్చులను తగ్గించుకునేందుకు మూడు సంస్థలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా 2027 నుంచి స్టీల్, ప్లాస్టిక్స్, రెసిన్లు, వైరింగ్ హార్నెస్ వంటి కీలక విడిభాగాల తయారీ ప్రమాణాలను ఉమ్మడిగా అమలు చేయనున్నాయి. ఈ విడిభాగాల వల్ల ఒక్కో బ్రాండ్ ప్రత్యేక గుర్తింపుపై ప్రభావం పడకపోవడంతో పాటు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నాయి.
ఈ ప్రణాళికలో భాగంగా స్టీల్‌కు ఉమ్మడి నాణ్యతా ప్రమాణాలు, ప్లాస్టిక్స్, రెసిన్లకు ఒకే తరహా పరీక్షా విధానాలు, వైరింగ్ కోసం సాధారణ కలర్ కోడింగ్ విధానాన్ని తీసుకురానున్నాయి. జపాన్ ఆటోమొబైల్ సంస్థలన్నీ పోటీ విషయంలో ఒకే రకమైన ఆందోళనను ఎదుర్కొంటున్నాయని, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని టయోటా వైస్ చైర్మన్ కోజి సాటో పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విడిభాగాలకు ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా ఆదా అయ్యే మొత్తాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, అధునాతన భద్రతా వ్యవస్థలు, ఆటోమొబైల్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి వినియోగించాలని కంపెనీలు భావిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!