

ఛేజింగ్ మాస్టర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ నేడు 38వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ‘విన్నర్ స్టేస్ ఆన్’ పేరుతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఇందులో కోహ్లీ తన కెరీర్లో అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్ ఏదో వెల్లడించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై చేసిన 43 పరుగుల ఇన్నింగ్సే తనకు అత్యంత ఇష్టమైనదని తెలిపాడు. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో రవీంద్ర జడేజా (33)తో కలిసి కోహ్లీ 47 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
మరోవైపు, కోహ్లీకి పలువురు క్రికెటర్లు, ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందిస్తూ.. ఆట పట్ల కోహ్లీకి ఉన్న అభిరుచి, పట్టుదల, ప్రేమ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నాడు. రాబోయే ఏడాది అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించాడు. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా కోహ్లీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. అతడి అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు, మరపురాని రన్ ఛేజింగ్‌లు, పోరాట స్ఫూర్తి, గెలవాలనే తపనను ప్రశంసించాడు. కోహ్లీ బ్యాటింగ్‌ను తాను ఎంతో ఆస్వాదిస్తానని, అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!