

ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు రావాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. రాజకీయ అంశాలపై చర్చించాలనుకుంటే వీధుల్లో కాకుండా పార్లమెంట్‌కు రావాలని రాహుల్‌కు సవాల్ విసిరారు. ఆందోళనల్లో నిజాలు, తర్కం ఉంటే పార్లమెంట్‌లో ముఖాముఖి చర్చకు సిద్ధం కావాలని అన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే సమాధానాలను రాహుల్ తట్టుకోలేరని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, కీలక చర్చలను బహిష్కరించడం కాంగ్రెస్ రాజకీయ వ్యూహంగా మార్చుకుందని విమర్శించారు. సభలో చర్చలకు దూరంగా ఉంటూ వీధుల్లో ప్రజలను సమీకరించి ఆందోళనలు చేపడుతోందని ఆరోపించారు.
హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ‘లోక్‌తంత్ర బచావో, అరాజకతా హఠావో’ పేరుతో నిర్వహించిన పాదయాత్రలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్‌పై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదుర్కొన్న పరాజయాలను ప్రస్తావిస్తూ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. మరోవైపు, దేశాన్ని అస్థిరపరిచేందుకు విపక్షాలు విదేశీ శక్తుల సాయం తీసుకుంటున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు డిమాండ్ చేస్తున్నారు. విదేశీ శక్తుల అండతో మోదీ ప్రధాని పదవిని కాపాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. లోక్‌సభలో తాను మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైక్ నిలిపివేస్తున్నారని కూడా ఆరోపించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!