

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల న్యూజిలాండ్ పర్యటన ముగిసింది. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ.. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. విరాట్ కోహ్లీ తొలి వన్డేలో అర్ధశతకం సాధించినా.. ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ముఖ్యంగా చివరి రెండు మ్యాచ్‌ల్లో పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాడు. దీంతో వీరిద్దరి జట్టులో కొనసాగింపుపై మరోసారి చర్చ మొదలైంది. అయితే మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాత్రం రోహిత్, కోహ్లీలకు మద్దతుగా నిలిచాడు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన వారి ఆటతీరును అంచనా వేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. గత 14 ఏళ్లుగా దేశం కోసం వారు అందించిన విజయాలు, సేవలను గుర్తుచేస్తూ.. వారి అనుభవం, ప్రతిభను తక్కువగా చూడకూడదని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీని మైదానంలో చూసేందుకే అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని, అతడు పరుగులు చేసినా చేయకపోయినా వారి అభిమానంలో మార్పు ఉండదని జడేజా వ్యాఖ్యానించాడు. అభిమానులను అలరించేందుకు కోహ్లీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. చివరి మ్యాచ్‌లో క్యాచ్ వదిలేసినప్పటికీ అతడిలోని పోరాట పటిమ, ఉత్సాహం స్పష్టంగా కనిపించాయని విశ్లేషించాడు. అప్పుడప్పుడు త్వరగా ఔట్ కావడం క్రికెట్‌లో సహజమని, ఒక మ్యాచ్ లేదా సిరీస్ ఆధారంగా సుదీర్ఘ కెరీర్‌ను అంచనా వేయకూడదని అన్నాడు. ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణించిన రోహిత్, కోహ్లీలకు కొన్ని తక్కువ స్కోర్ల కారణంగా విమర్శలు చేయకుండా మద్దతుగా నిలవాలని జడేజా అభిప్రాయపడ్డాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!