

యువ వికెట్‌కీపర్ బ్యాటర్ వంశ్ బేడీని ఇటీవల ముగిసిన దిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) సందర్భంగా ఫిక్సింగ్‌కు సంబంధించిన అంశంలో సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని బేడీ వెంటనే లీగ్ అవినీతి నిరోధక విభాగం (ACU) దృష్టికి తీసుకెళ్లాడు. 2026 డీపీఎల్‌లో సెంట్రల్ దిల్లీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వంశ్ బేడీ.. 2025 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ ఉన్నాడు. ఈ వ్యవహారంపై దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) బీసీసీఐకి సమాచారం అందించి, తదుపరి చర్యలపై మార్గదర్శకత్వం కోరింది. పూర్తి దర్యాప్తు అనంతరం మాత్రమే ఆరోపణలపై నిర్ధారణకు రావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఇదే సమయంలో మాజీ రంజీ క్రికెటర్ రచిత్ భాటియా చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ‘టెహెల్కా’ స్టింగ్ ఆపరేషన్‌లో భాటియా.. 2025 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన జట్టు వివరాలను బుకీలకు చేరవేసినట్లు, ఐదు మ్యాచ్‌లను ఫిక్స్ చేసినట్లు ఆరోపణలు చేశాడు. అయితే ఇవి స్టింగ్ ఆపరేషన్‌లో భాటియా చేసిన వాదనలు మాత్రమేనని, అధికారిక దర్యాప్తులో అవి నిర్ధారణ కాలేదని గమనించాలి. ఈ నేపథ్యంలో వంశ్ బేడీ పేరు సోషల్ మీడియాలో చర్చకు రాగా, తాను ఆ స్టింగ్‌లో ప్రస్తావించిన ఆటగాడిని కాదని, ఎలాంటి ఫిక్సింగ్ కార్యకలాపాలతోనూ తనకు సంబంధం లేదని అతడు స్పష్టం చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!