

విజయనగరం జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో కూటమి విజయపరంపర కొనసాగుతోంది. బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ ఘన విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై ఆమె 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నీరజ విజయంతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకోగా, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవి రేసులో ఉన్న అనూష ఓటమి వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బగా మారింది.
బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించారు. అయితే, పూసపాటిరేగ స్థానం నుంచి ఆయన సోదరుడి కుమారుడు చైతన్య దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. బొండపల్లి నుంచి కుమార్తె అనూష, గరివిడి నుంచి కోడలు బొత్స పూజిత, గుర్ల నుంచి సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి బరిలో నిలిచారు. గరివిడి జడ్పీటీసీ స్థానంలో పూజిత టీడీపీ అభ్యర్థి కిమిడి సంధ్యపై 1,599 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు, స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!