

బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాల గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో హిందీ బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తొలుత రియాలిటీ షోలను తాను చాలా చిన్నచూపు చూసేదానినని, అయితే పరిస్థితుల కారణంగా తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో వరుసగా కొన్ని పాటల్లో నటించినప్పటికీ, తనకు రావాల్సిన పారితోషికం అందలేదని చెప్పారు. నిర్మాతలు ఏజెన్సీకి డబ్బులు చెల్లించి ఉండొచ్చని, కానీ తనకు మాత్రం ఎలాంటి చెల్లింపు జరగలేదని వెల్లడించారు. డబ్బుల కోసం నిర్మాతలతో గొడవ పడాల్సి వచ్చిందని, ఆ సమయంలో మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని నోరా తెలిపారు. అదే సమయంలో బిగ్‌బాస్ బృందం నుంచి తనకు ఆఫర్ వచ్చిందని చెప్పారు.
మొదట బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు తాను అసలు అంగీకరించలేదని నోరా గుర్తుచేసుకున్నారు. అయితే షో ద్వారా వచ్చే భారీ పారితోషికం గురించి చెప్పడంతో తన నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు. డబ్బుల కోసమే బిగ్‌బాస్‌లోకి వెళ్లానని ఆమె స్పష్టం చేశారు. రియాలిటీ షోలు అంత చెడ్డవి కాదని, అవి తక్కువ సమయంలోనే గుర్తింపు తీసుకొస్తాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కావడంతో ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండాల్సిన అవసరం లేదని భావించినట్లు చెప్పారు. అదే సమయంలో తాను ‘ఝలక్ దిఖ్లా జా’లో పాల్గొనాలని బలంగా కోరుకున్నానని, అందుకే బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు ఓ షరతు పెట్టినట్లు తెలిపారు. బిగ్‌బాస్‌లో పాల్గొంటే ‘ఝలక్ దిఖ్లా జా’లో అవకాశం ఇవ్వాలని ఛానెల్ నిర్వాహకులను కోరగా, వారు అంగీకరించడంతోనే తాను షోలోకి అడుగుపెట్టినట్లు నోరా వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!