

బిగ్‌బాస్ తెలుగు 10 ఎనిమిదో వారంలో ఆదివారం, నవంబర్ 1న జరిగిన ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఝాన్సీ ఎలిమినేట్ కాగా, ఇంటి సభ్యుల మెజారిటీ ఓట్లతో రోహిత్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఈ రెండు ఎలిమినేషన్లతో పాటు ‘సండే ఫండే’ థీమ్‌లో భాగంగా పలు వినోదాత్మక టాస్కులు జరిగాయి. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో సరదా ఆటలు ఆడిస్తూ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా నడిపించారు.
ఎలిమినేట్ అయి స్టేజ్‌పైకి వచ్చిన ఝాన్సీ, బిగ్‌బాస్ హౌస్‌లో తన ప్రయాణానికి సంబంధించిన వీడియోను చూసి భావోద్వేగానికి గురైంది. అనంతరం ఆమెకు కొన్ని సామెతలు ఇచ్చి, అవి ఏ కంటెస్టెంట్‌కు సరిపోతాయో చెప్పాలని టాస్క్ ఇచ్చారు. ఈ సందర్భంగా రోహిత్‌కు ‘కుక్క తోక వంకర’ అనే సామెతను చెప్పిన ఝాన్సీ, దేబ్జానీకి ‘ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు’ అని పేర్కొంది. చిన్న విషయాలను పెద్దవిగా చేస్తాడంటూ త్రిగుణ్‌పై వ్యాఖ్యానించింది. మెరిసేదంతా బంగారం కాదంటూ ముకేష్‌కు చెప్పడంతో పాటు, చివరకు విజయం అతడినే వరించవచ్చని అభిప్రాయపడింది. ఇక నరేష్‌కు ‘ఇంట్లో పులి.. వీధిలో పిల్లి’ అనే సామెతను వర్తింపజేసింది.
ఆ తర్వాత ‘చేదు నిజాలు’ పేరుతో కాకరకాయ లడ్డూ టాస్క్ నిర్వహించారు. ఇందులో కంటెస్టెంట్లు తమ గురించి ఎవరు ఎలాంటి అభిప్రాయాలు రాశారో గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం తమ బొమ్మలను పగలగొట్టి, అందులోని కార్డుపై ఉన్న వ్యాఖ్యను చదివి దాన్ని రాసిన వ్యక్తిని గుర్తించాలి. సరైన సమాధానం చెబితే అవతలి వ్యక్తి లడ్డూ తినాలి. తప్పుగా చెబితే సమాధానం చెప్పిన వ్యక్తే లడ్డూ తినాల్సి ఉంటుంది. తన గురించి సుధీర్ రాశాడని త్రిగుణ్ భావించినప్పటికీ, ఆ వ్యాఖ్య రాసింది వర్షిణి. ఇక ముకేష్, దేబ్జానీ మాత్రమే ఒకరి గురించి మరొకరు రాసిన వ్యాఖ్యలను సరిగ్గా గుర్తించారు. శ్వేత గురించి ఎవరూ ఎలాంటి అభిప్రాయం రాయకపోవడంతో ఆమె ఆటతీరును పరిశీలించుకోవాలని నాగార్జున సూచించారు.
అనంతరం సైగల ద్వారా పాటలను గుర్తించే మరో టాస్క్ నిర్వహించారు. ఇందులో హుక్ స్టెప్స్ వేయకూడదని నాగార్జున ముందుగానే హెచ్చరించినప్పటికీ, సుధీర్ హుక్ స్టెప్ వేయడంతో ముకేష్ టీమ్‌కు మైనస్ పాయింట్లు వచ్చాయి. చివరకు నరేష్ టీమ్ విజయం సాధించింది. ఆ తర్వాత రెడ్ జోన్‌లో ఉన్న శ్వేత, ఆర్కే, రోహిత్‌లలో ఒకరిని ఎలిమినేట్ చేసే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలో కన్‌ఫెషన్ రూంలో తాను చూసిన వీడియో గురించి త్రిగుణ్.. అమన్, నరేష్, రాం ప్రసాద్‌లకు వివరించాడు. కెప్టెన్ రూంలో ఉండటంపై రోహిత్ తమ గురించి ప్రతికూలంగా మాట్లాడాడని, బూతులు కూడా మాట్లాడినట్లు త్రిగుణ్ పేర్కొన్నాడు.
ముకేష్, వర్షిణి, సుధీర్, నీతూ రోహిత్ హౌస్‌లో కొనసాగాలని ఓటు వేయగా, ఆర్కే ఎలిమినేట్ కావాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు నరేష్, దేబ్జానీ, రాం ప్రసాద్, శివ్, అమన్, వంశీ, త్రిగుణ్ రోహిత్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. శ్వేతకు ఒక్క ఓటు కూడా రాలేదు. దీంతో అత్యధిక ఓట్లు వచ్చిన రోహిత్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. బయటకు వెళ్లే ముందు నీతూకు ధైర్యం చెప్పిన రోహిత్.. చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలని, అన్నంపై కోపాన్ని చూపించవద్దని సూచించాడు. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన నరేష్‌ను రోహిత్ ప్రశ్నించాడు. అయితే, ఆర్కేకు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా ఓటు వేసినట్లు నరేష్ వివరణ ఇచ్చాడు. అందరూ బాగా ఆడాలని, ఉత్తమంగా ఆడినవారే విజయం సాధించాలని కోరుకుంటూ రోహిత్ వెళ్లిపోయాడు. ఇక వచ్చే వారం ‘రివార్డ్ అండ్ రివెంజ్’ థీమ్‌తో గేమ్ కొనసాగుతుందని నాగార్జున ప్రకటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!