

అరాచకాన్ని సృష్టించేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనవసర సమస్యలను లేవనెత్తుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. ఆయన అలా చేస్తున్నంత కాలం ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లరని స్పష్టం చేశారు. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన సభను అస్తవ్యస్తమైన, అదుపుతప్పిన ప్రదర్శనగా అభివర్ణించారు. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ, కొద్దిమంది మాత్రమే వచ్చారని ఆరోపించారు. సభకు భారీగా జనం తరలివచ్చారన్న ప్రచారం, ఓటు చోరీ ఆరోపణలు రెండూ అబద్ధాలేనని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు.
ఫొటోగ్రఫీ, కెమెరా కోణాల ద్వారా సభకు భారీగా జనం వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారని రాహుల్ గాంధీని ఉద్దేశించి సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. ఇలాంటి పద్ధతులతో ఎవరూ ప్రధానమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను చట్టవిరుద్ధమైనవిగా రాహుల్ అభివర్ణించడాన్ని ఖండించారు. మోదీ, అమిత్ షా పదవులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. దేశం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, భారతీయులందరికీ చెందిందని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!