

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేషన్ కావడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు షోలో తమకు ఎదురైన అనుభవాలు, టీమ్ నిర్ణయాలు లేదా హోస్ట్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే, రోహిత్ విషయంలో మాత్రం భిన్నమైన పరిణామం చోటుచేసుకుంది. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి బిగ్‌బాస్ షోలో అతనికి ఎదురైన పరిస్థితులను ప్రస్తావిస్తూ ఘాటైన పోస్ట్ వెలువడినట్లు తెలుస్తోంది. వారాల తరబడి రోహిత్‌ను టార్గెట్ చేశారని, టాస్కులు, సంభాషణల ద్వారా అతనిపై మానసిక ఒత్తిడి పెరిగిందని ఆ పోస్ట్‌లో ఆరోపించారు. ఒంటరితనం, మానసిక క్షోభ వంటి పరిస్థితులు ఎదురైనా రోహిత్ ధైర్యంగా నిలబడి ఆటను కొనసాగించాడని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రేక్షకుల ఓటింగ్‌తో కాకుండా హౌస్‌మేట్స్ ఓటింగ్ ఆధారంగా అతన్ని ఎలిమినేట్ చేసినట్లు కూడా ఆ పోస్ట్‌లో వెల్లడించారు.
ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ స్టేజ్‌పైకి వచ్చిన రోహిత్‌కు సీక్రెట్ రూంలోకి వెళ్లి ఆటను కొనసాగించే అవకాశం ఇచ్చినట్లు ఆ పోస్ట్ ద్వారా వెల్లడైంది. అయితే, మరోసారి హౌస్‌లోకి వెళ్లడం కంటే తన ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన రోహిత్ ఆ ఆఫర్‌ను వెంటనే తిరస్కరించినట్లు పేర్కొన్నారు. మరికొన్ని రోజుల స్క్రీన్ టైమ్ కోసం తన గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి అతను ఇష్టపడలేదని పోస్ట్‌లో ప్రశంసించారు. కష్టమైన పరిస్థితుల్లోనూ రోహిత్‌కు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అతని నిర్ణయం ఓటమి కాదని, ఆత్మగౌరవానికి నిదర్శనమని అభివర్ణించారు. బిగ్‌బాస్ షోలో రోహిత్‌కు ఎదురైన పరిస్థితులపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోహిత్ ఎలిమినేషన్‌పై అతని అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ రేసులో ఉన్న బలమైన కంటెస్టెంట్‌ను హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా బయటకు పంపడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. షో నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునపై కూడా కొందరు అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. గతంలో తానే బిగ్‌బాస్ సీజన్ 10 విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేసిన రోహిత్, త్రిగుణ్‌తోనూ సవాల్ విసిరాడు. అయితే, ఫినాలేకు చేరకముందే అతని ప్రయాణం ముగిసింది. సీక్రెట్ రూం ఆఫర్‌ను తిరస్కరించడం ఇప్పుడు అతని ఎలిమినేషన్‌లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చేసిన ఆరోపణలు రోహిత్ అధికారిక ఖాతా వెల్లడించిన అభిప్రాయాలేనని, ఈ పరిణామాల పూర్తి వివరాలు టెలివిజన్ ఎపిసోడ్‌లో తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!