

బిగ్‌బాస్ తెలుగు 10 ఇంట్లో రెండో వారం నామినేషన్స్ హీట్ పెరిగినట్లు కనిపిస్తోంది. మొదటి వారంలో ఓపెన్ నామినేషన్స్ లేకపోవడంతో ఎదుటివారు చెప్పే కారణాలకు స్పందించే అవకాశం లేకపోయింది. అయితే ఈసారి ఓపెన్ నామినేషన్స్ నిర్వహించారు. నామినేట్ చేసే అవకాశం దక్కాలంటే ముందుగా టాస్క్‌లో గెలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో త్రిగుణ్, రోహిత్‌లకు గట్టిగానే నామినేషన్స్ పడినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.
సెలెబ్రిటీ టీమ్ నుంచి త్రిగుణ్‌కు గట్టి వ్యతిరేకత ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. తాను చెప్పిన మాటనే అందరూ వినాలని అనుకోవడం, ఇతరులకు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వకపోవడం, సందర్భానుసారం మాట మార్చడం వంటి కారణాలతో పలువురు అతడిని నామినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రోమోలో సుధీర్ ముందుగా త్రిగుణ్‌ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. మాటలు మార్చుతున్నాడని, చైత్ర పేరును ముందుగా ప్రస్తావించాడని సుధీర్ ఆరోపించినట్లు కనిపిస్తోంది.
సుధీర్ షాలినీని కూడా నామినేట్ చేస్తూ ఆమెకు వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించాడు. ఒక్కరోజు కూడా వాష్‌రూమ్ పని చేయకుండా, తనకు అప్పగించిన పనిని వర్షిణికి కేటాయించేందుకు తన అధికారాన్ని ఉపయోగించిందని సుధీర్ పేర్కొన్నాడు. దీనికి షాలినీ స్పందిస్తూ తాను తన అధికారాన్ని సరిగ్గానే ఉపయోగించుకున్నానని, సుధీర్ తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడో తాను కూడా చూస్తానని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు దేబ్జానీ, సుధీర్, త్రిగుణ్‌ల మధ్య జరిగిన చర్చలో అమన్‌కు మద్దతు విషయంలో త్రిగుణ్ మాట మార్చాడన్న అంశంపై వాగ్వాదం జరిగింది.
ఇక త్రిగుణ్ వ్యాఖ్యలపై రోహిత్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. శ్రిష్టిని సుధీర్ మీదకు పంపిస్తానంటూ త్రిగుణ్ చెప్పిన తీరు సరిగ్గా లేదని రోహిత్ పేర్కొన్నాడు. దీనిపై త్రిగుణ్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు. మరోవైపు శ్రిష్టి తాను ఇంట్లో అందరితో సమానంగా మాట్లాడుతున్నానంటూ భావోద్వేగానికి గురైంది. రోహిత్ ఝాన్సీని నామినేట్ చేస్తూ ఆమె సేఫ్ గేమ్ ఆడుతోందని, తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయడం లేదని ఆరోపించాడు. ఝాన్సీ తన వాదనను వివరించే సమయంలో త్రిగుణ్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రెండో వారం నామినేషన్స్‌లో మరింత హీట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!