

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌లో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన కంటికి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడ్డారు. ప్రసంగం మధ్యలోనే ఆగి, నీటితో తడిపిన టిష్యూతో కంటిని తుడుచుకున్నారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగించారు. “నా కంట్లో ఏదో పడింది.. కొంచెం చూడండి” అంటూ అక్కడున్న సిబ్బందిని కోరిన ట్రంప్.. కంటిని తుడుచుకున్న తర్వాత కొంత ఉపశమనం కలిగిందని, ఐ డ్రాప్స్ ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల కాన్సాస్, అయోవాలో నిర్వహించాల్సిన ప్రచార కార్యక్రమాలను ట్రంప్ తొలుత రద్దు చేయడం కూడా ఆయన ఆరోగ్యంపై చర్చకు దారితీసింది. అయితే తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ రెండు ర్యాలీలను తిరిగి నిర్వహించారు. డేటోనా బీచ్ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయన ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, మరికొందరు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. మరోవైపు, అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికలు ట్రంప్ అధ్యక్ష పదవీకాలంలో కీలక ఘట్టంగా నిలవనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని 435 స్థానాలతో పాటు సెనేట్‌లో మూడో వంతు స్థానాలకు పోలింగ్ జరగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!