

దాదాపు 22 ఏళ్లుగా అంతరిక్షంలో సేవలందిస్తున్న నాసాకు చెందిన ‘స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ టెలిస్కోప్ త్వరలో భూమిపైకి కూలిపోనుంది. దాన్ని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు విఫలం కావడంతో కక్ష్య నుంచి క్రమంగా దిగజారుతోంది. ఈ నేపథ్యంలో టెలిస్కోప్ త్వరలోనే భూమి వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోయే అవకాశం ఉందని అమెరికా స్పేస్ ఫోర్స్ అంచనా వేస్తోంది. సుమారు ఒకటిన్నర టన్నుల బరువున్న ఈ టెలిస్కోప్‌లో ఎక్కువ భాగం వాతావరణంలోనే కాలిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, కొన్ని భాగాలు, అద్దాల ముక్కలు భూమిని చేరే అవకాశం ఉందని మిషన్ ముఖ్య శాస్త్రవేత్త బ్రాడ్ సెంకో తెలిపారు.
2004 నవంబర్ 20న ప్రయోగించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ.. విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన విస్ఫోటనాలైన గామా కిరణాల విస్ఫోటనాలు (గామా రే బరస్ట్స్), సూపర్‌నోవాలను పరిశీలించేందుకు రూపొందించారు. దీన్ని రక్షించే బాధ్యతను నాసా ‘కాటలిస్ట్ స్పేస్’ సంస్థకు అప్పగించింది. అయితే, ఈ ఏడాది జులైలో ఆ సంస్థ ప్రయోగించిన ‘లింక్’ అనే మూడు చేతుల రోబో మిషన్ విఫలమైంది. ఆ రోబో సెప్టెంబర్‌లో భూమిపై కూలిపోయింది. పరిస్థితి మరింత దిగజారడంతో అక్టోబర్‌లో స్విఫ్ట్ టెలిస్కోప్‌లోని వ్యవస్థలను నిలిపివేశారు. తన సేవాకాలంలో ఈ అబ్జర్వేటరీ 2,000కు పైగా గామా రే బరస్ట్స్, 1,400 సూపర్‌నోవాలతో పాటు అనేక తోకచుక్కలు, గ్రహశకలాలు, బ్లాక్ హోల్స్‌ను పరిశీలించింది. అంతరిక్షంలో ఎక్కడైనా విస్ఫోటనం సంభవించినప్పుడు ఆ దిశగా వేగంగా తిరిగి పరిశీలించడం దీని ప్రత్యేకత. అందుకే దీనికి ‘స్విఫ్ట్’ అనే పేరు పెట్టారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!