

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం సమయంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతల తీర్మానంపై చర్చ సందర్భంగా భారత్–చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ, మాజీ భారత సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణే రాసిన ప్రచురణకు రాని ఆత్మకథలోని భాగాన్ని ఆయన ఉదహరించడంతో అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పుస్తకం ఇంకా విడుదల కాలేదని, అందులోని అంశాలను సభలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. దీనికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా మద్దతు ఇవ్వడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రస్తావించిన వ్యాఖ్యలు పుస్తకం నుంచి కాకుండా ఒక మ్యాగజైన్ నుంచి వచ్చాయని అన్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం తన వాదనకు కట్టుబడి, ఆ వ్యాఖ్యలు నమ్మదగిన వనరుల నుంచి తీసుకున్నవేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చైనా అంశంపై చర్చను తప్పించుకుంటోందని ఆరోపించారు. నరవాణే ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’లో లడఖ్‌లో జరిగిన సంఘటనల సమయంలో రాజకీయ, సైనిక నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడాన్ని ప్రస్తావించారని రాహుల్ గుర్తు చేశారు. ఈ పరిణామాలతో సభలో వాగ్వాదం చోటుచేసుకుని, కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!