

మైనార్టీలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. విద్య, ఉద్యోగ రంగాల్లో మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. సేవాలాల్ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్య, మైనార్టీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్య, నీటిపారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన హయాంలో వేసిన పునాదుల వల్లే ఈ రెండు రంగాల్లో దేశం అభివృద్ధి సాధించిందన్నారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ఐఐటీలను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర ఉందని పేర్కొన్నారు. గతంలో ఏర్పాటైన విద్యాసంస్థల వల్లే నేడు భారతీయులు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో సీఈవోలుగా ఎదిగారని చెప్పారు. మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ఏటీసీలు) మారుస్తున్నామని, మరిన్ని సౌకర్యాలతో స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, అయితే బ్లూ కాలర్ ఉద్యోగాలపై సాంకేతికత ప్రభావం తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. మైనార్టీలకు అందించే స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ భాజపా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని గుర్తుచేశారు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని, వారు ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్‌కు మంత్రి పదవి కల్పించామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ మీరాలం చెరువుపై సుమారు రూ.600 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఆక్రమణలను తొలగించి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మూసీ సుందరీకరణ పూర్తయితే పర్యాటకులు హైదరాబాద్‌తో పాటు పాతబస్తీని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని, తద్వారా నగరంలో నైట్ ఎకానమీ కూడా పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!