

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ సైనికులకు శుభవార్త ప్రకటించారు. ‘వారియర్ డివిడెండ్’ పేరిట ఒక్కో సైనికుడి ఖాతాలోకి 1,776 డాలర్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సైనికుల సేవలు, త్యాగాలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది సైనికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనుండగా, క్రిస్మస్కు ముందే వారి ఖాతాల్లో సుమారు రూ.1.60 లక్షలు జమ కానున్నాయి.
బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, టారీఫ్‌లు పెంచడంతో పాటు ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను ఆమోదించామని తెలిపారు. ఈ చర్యల వల్ల ఊహించని స్థాయిలో ఆదాయం సమకూరిందని, ఆ నిధులను సైనికుల సంక్షేమానికి వినియోగించడమే ఉత్తమమని చెప్పారు. మొత్తం 14.5 లక్షల మంది సైనికులకు ప్రత్యేక వారియర్ డివిడెండ్ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని, చెక్కులు ఇప్పటికే పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వం సైనికులకు 1,776 డాలర్ల డివిడెండ్ ఇవ్వడంలో ఒక చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. 1776 లో బ్రిటన్ నుంచి అమెరికా స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఆ ఘట్టాన్ని స్మరించుకుంటూ, దేశానికి సేవ చేస్తున్న సైనికులను గౌరవించేందుకు ఈ మొత్తాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ట్రంప్ సైనికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!