

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం క్రమంగా కోలుకుంటోందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేశాయని పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తనను సహా అనేక మందిని బాధించాయని గుర్తు చేశారు. గతంలో అడ్డుకున్నవారే ఇప్పుడు నీతులు చెబుతున్నారని వ్యాఖ్యానిస్తూ, ప్రజలు ప్రతి అంశాన్ని గమనించి సరైన సమయంలో తీర్పు ఇస్తారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన నష్టాలపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని, క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి తోడ్పాటునిచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షేమం మరియు అభివృద్ధిని సమతూకంగా అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద నెలకు రూ.2,750 కోట్లు, ఏడాదికి రూ.33 వేల కోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం ద్వారా అర్హులైన కుటుంబాల్లోని పిల్లలందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయని, దీపం 2.0 ద్వారా మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20 వేలును మూడు విడతల్లో ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో మౌలిక వసతుల నిర్మాణం ద్వారా సంపద సృష్టి జరుగుతోందని, పీ4 కార్యక్రమం అట్టడుగువారికి చేయూతనందించేదని చెప్పారు. సంపద సృష్టి ద్వారానే సంక్షేమాన్ని విస్తరించగలమని, జీరో పావర్టీ కార్యక్రమం దేశంలోనే ఉత్తమ పేదరిక నిర్మూలన మోడల్ అని వివరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!