
.jpg&w=3840&q=75)
డాలస్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాల క్రితమే తెలుగువారు అమెరికాకు వచ్చి తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ప్రపంచంలోని పలు రంగాల్లో తమ సత్తా చాటిన ప్రవాసాంధ్రుల పై ప్రభుత్వం గర్వపడుతుందని పేర్కొన్నారు.
కష్టకాలంలో ప్రవాసాంధ్రులు చూపిన అండను తాము ఎప్పటికీ మరిచిపోమని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు అన్యాయంగా 53 రోజుల పాటు జైలులో ఉండగా, అమెరికాలోని తెలుగు వారంతా గళమెత్తి మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి వేగం కారణంగా ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోందని, కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం 20 లక్షల ఉద్యోగ అవకాశాల సృష్టి అని లోకేశ్ వెల్లడించారు. ‘వాళ్లు వై నాట్ 175 అన్నారు కానీ, ప్రజలు వై నాట్ 11 అని చెప్పారు’ అని ఆయన రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు.
ప్రవాసాంధ్రులకు ఎలాంటి సమస్య వచ్చినా ఏపీఎన్ఆర్టీ వెంటనే స్పందిస్తుందని భరోసా ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా తప్పించుకోలేరని, రెడ్‌బుక్ ప్రకారం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. తాము ఎలాంటి వ్యక్తిగత కక్షసాధింపులు చేయడం లేదని స్పష్టం చేశారు.
2019 నుంచి 2024 వరకు జరిగిన పాలనలో రాష్ట్రం చాలానే వెనుకబడ్డిందని, అందుకే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా తోసిపుచ్చారన్నారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి ఘన విజయం సాధించిందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకువెళ్తామని లోకేశ్ తెలిపారు.
దేశంలో అనేక రాష్ట్రాలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు కలిగి ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వాన్ని పొందిన రాష్ట్రమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఒక రాష్ట్రం – ఒక రాజధాని’ అన్న సిద్ధాంతంతో వికేంద్రీకరణ ఆధారంగా అభివృద్ధి జరపడం తమ సంకల్పమని, వచ్చే పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం నిరంతరంగా అధికారంలో ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!