
.avif&w=3840&q=75)
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, అదే రోజు ఫలితాలు ప్రకటించబడనున్నాయి.
అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో లక్షల్లో పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. 3,000 కి పైగా పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు.
ఈ విడతలో మొత్తం 189 మండలాలకు చెందిన 3,800 గ్రామ పంచాయతీల్లో, 37,440 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. 56 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచ్ పదవికి 12,960 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే 395 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో, అక్రమంగా తరలిస్తున్న రూ. 8.20 కోట్ల నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోడ్ ఉల్లంఘన కేసుల్లో ఇప్పటివరకు 229 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.
సరిహద్దు ప్రాంతాల్లో 54 చెక్‌పోస్టులు, 537 ఫ్లైయింగ్ స్క్వాడ్లు గస్తీ కాస్తూ పర్యవేక్షణను కఠినతరం చేశాయి. పోలింగ్ జరుగుతున్న మండలాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఎక్సైజ్ విభాగం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 14 న రెండో విడత, 17 న మూడో విడత పంచాయతీ పోలింగ్ జరగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!